గుంటూరు, తెనాలి మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం : జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల సామగ్రి పంపిణీ
పచ్చవ పరశురాం | బ్యూరో చీఫ్ | GEETV
గుంటూరు, అక్టోబర్ 31: గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి మున్సిపాలిటీల్లో నవంబర్ 1వ తేదీన జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమం శనివారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.
గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో, తెనాలిలోని జెఎంజె మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల ద్వారా పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేశారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామగ్రిని స్వీకరించారు.

సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రూట్ల వారీగా పంపిణీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బంది కూర్చుని సామగ్రిని పరిశీలించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పంపిణీ ప్రక్రియ సులభతరమైంది. సిబ్బందికి ఫలహారం, మధ్యాహ్న భోజనంతో పాటు రవాణా సౌకర్యాలను కూడా కల్పించారు.
రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ నాయర్ పంపిణీ కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ మాట్లాడుతూ గుంటూరు, తెనాలి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 596 పోలింగ్ కేంద్రాలకు 4,514 మంది సిబ్బందిని, తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని 185 పోలింగ్ కేంద్రాలకు 1,185 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 781 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. గుంటూరులో 76 వార్డులు, తెనాలిలో 52 వార్డులు కలిపి మొత్తం 128 వార్డులు ఉండగా, తెనాలిలో ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 127 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
#GunturElections #TenaliElections #MunicipalElections #APLocalBodyElections #Election2026 #GunturNews #TenaliNews #PollingArrangements #VotingDay #ElectionCommission #AndhraPradesh #TeluguNews #GEETV #GEETVNews