మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ
GEETV, గుంటూరు, నవంబర్ 3: మురసు తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటించిన ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పెదకాకాని, ప్రత్తిపాడు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ రాబోయే 24 గంటలు అత్యంత కీలకమని, ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలను ముందుగానే గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్తిపాడు, నంబూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, వృద్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పూరిళ్లు, వర్షాలకు పూర్తిగా తడిసిన ఇళ్లు, శిథిలావస్థకు చేరిన భవనాల్లో ప్రజలు ఉండరాదని స్పష్టం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. చెరువులు, వాగులు, వంకలు, నదీ తీర ప్రాంతాల వద్దకు ప్రజలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ కారణంగా ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా, పశువులకు కూడా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
వర్షాలు, బలమైన గాలుల కారణంగా కూలిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని, రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణను వేగవంతం చేయడంతో పాటు మొబైల్ నెట్వర్క్ సేవల్లో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున, రాబోయే మూడు రోజులపాటు బ్యారేజీ దిగువన ఉన్న తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నది వద్దకు వెళ్లరాదని సూచించారు. నల్లమల గెడ్డ ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు.
#MurusuCyclone #GunturRainAlert #HeavyRains #GunturCollector #CMSaikantVarma #CycloneAlert #FloodWarning #PrakasamBarrage #Prathipadu #Pedakakani #Namburu #Atmakur #SDRF #GunturNews #AndhraPradesh #GEETV #GEETVNews