గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ
లాలుపురంలో పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ
ఉదయం 11 గంటల సమయానికి 23 శాతం పోలింగ్ నమోదు
V.K. PALADUGU | REPORTER | GEETV
GEETV, గుంటూరు, నవంబరు 5: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. గురువారం గుంటూరు రూరల్ మండలం లాలుపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేయడంతో పాటు, ఓటర్లు, పోలింగ్ సిబ్బందితో స్వయంగా మాట్లాడి పోలింగ్ నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్.. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని వెల్లడించారు. ఉదయం 9 గంటల సమయానికి 6.02 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉదయం 11 గంటల సమయానికి అది 23 శాతానికి చేరినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 724 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
జిల్లాలో 13 జెడ్పీటీసీ స్థానాలకు, 193 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అర్హులైన ఓటర్లందరూ ఎలాంటి సంకోచం లేకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
#Guntur #GunturCollector #SaikantVarma #MPTCElections #ZPTCElections #PollingUpdate #Lalupuram #GunturDistrict #APElections #AndhraPradeshNews #GEETVNews