సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్
Parasuram Pachava | Bureau Chief | GEETV
GEETV, గుంటూరు: జిల్లాలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల పరిస్థితులను సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పరిసరాలను పర్యవేక్షించడంతో పాటు, సమర్థ యాప్ సహాయంతో వివిధ ప్రాంతాల్లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఎన్నికల విధుల్లో ఉన్న మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
జిల్లాలో ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ఓటర్లు ఎలాంటి వదంతులు, అపోహలను నమ్మకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ పర్యవేక్షణలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాస్, కంట్రోల్ రూమ్ సీఐ బిలాలుద్దీన్, ఐటీ కోర్ సీఐ నిస్సార్ బాషా తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..
#VakulJindal #GunturSP #GunturPolice #MPTCElections #ZPTCElections #ElectionMonitoring #PoliceControlRoom #Webcasting #DroneSurveillance #GunturNews #AndhraPradesh #GEETVNews