మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు
పచ్చవ పరశురాం, బ్యూరో ఛీఫ్ | GEETV |
GEETV, ఒంగోలు : మురసు తుఫాను తొమ్మిది మంది మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సముద్రంలో గల్లంతైన తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారుల్లో నలుగురి మృతదేహాలు ఆంధ్రప్రదేశ్ తీరంలో లభ్యమయ్యాయి. మరో ఐదుగురి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
తమిళనాడులోని చెన్నై కాసిమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి అక్టోబర్ 29న సెల్వఅళగన్కు చెందిన ట్రాలర్ తొమ్మిది మంది మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకు బయలుదేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని నిజాంపట్నం సమీపంలో చేపల వేట సాగిస్తున్న సమయంలో మురసు తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో సమీపంలోని హార్బర్లలో ఆశ్రయం పొందాలని మత్స్యశాఖ అధికారులు సూచించారు.
అయితే నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున ఆ పడవ నుంచి ప్రమాద సమాచారం అందింది. భారీ వర్షం కారణంగా పడవ ఇంజిన్ గదిలోకి నీరు చేరడంతో ఇంజిన్ పనిచేయడం నిలిచిపోయిందని, నావిగేషన్ వ్యవస్థ కూడా దెబ్బతిన్నదని మత్స్యకారులు సమీపంలోని మరో పడవకు సమాచారం అందించారు. రామయపట్నం వైపు వెళ్తుండగా సుమారు 20 నాటికల్ మైళ్ల దూరం కొట్టుకుపోయామని, తమను రక్షించాలని ఆవేదనతో సహాయం కోరారు.
ఈ సమాచారంతో తమిళనాడు మత్స్యశాఖ అధికారులు ఇండియన్ కోస్ట్‌గార్డ్‌ను సంప్రదించి గగనతల గాలింపు చర్యలకు విజ్ఞప్తి చేశారు. పడవ యజమాని కూడా రెండు యాంత్రిక పడవలను పంపి గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు.
ఈ క్రమంలో నవంబర్ 4వ తేదీ సాయంత్రం ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం తీరంలో తలకిందులైన పడవను స్థానిక మత్స్యకారులు గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. గురువారం తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారుల బృందం కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలుకు చేరుకుంది.
ఇంతలో తప్పిపోయిన తొమ్మిది మంది మత్స్యకారుల్లో నలుగురి మృతదేహాలు కొత్తపట్నం సమీపంలో తీరానికి కొట్టుకువచ్చాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో పచ్చబొట్లు, ఇతర శారీరక గుర్తుల ఆధారంగా కుటుంబ సభ్యుల సహాయంతో గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు కొత్తపట్నం తీరాన్ని సందర్శించి సహాయక, గాలింపు చర్యలను పరిశీలించారు. మిగిలిన ఐదుగురి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు గాలింపు కొనసాగిస్తున్నారని తెలిపారు. తలకిందులైన పడవను కూడా వీలైనంత త్వరగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మురసు తుఫాను ప్రభావంతో సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల విషాదాంతం అందరినీ కలచివేస్తోంది. మరో ఐదుగురి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
#TamilNaduFishermen #Kothapatnam #Ongole #MurasuCyclone #FishermenMissing #FishermenTragedy #CoastGuard #RescueOperation #PrakasamDistrict #AndhraCoast #Nizampatnam #AndhraPradeshNews #GEETVNews