పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ
గుంటూరు:
చదువుకున్న కళాశాలపై మమకారం.. విద్యాబుద్ధులు నేర్పిన సంస్థ అభివృద్ధిపై బాధ్యత.. ఈ రెండింటినీ చాటుకుంటూ గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. తాము విద్యనభ్యసించిన కళాశాల అభివృద్ధికి ఆర్థికంగా అండగా నిలుస్తూ, 1980 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సుమారు రూ.50 లక్షల వ్యయంతో బయోకెమిస్ట్రీ విభాగాన్ని ఆధునీకరించారు. పునరుద్ధరించిన ఈ విభాగాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అదనపు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎన్.వి. సుందరాచారి సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. 1980 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ నూతలపాటి శ్రీనివాసరావు, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ షీలా రాణి, డాక్టర్ శారదతో పాటు ఇతర పూర్వ విద్యార్థులు ఈ ఆధునీకరణకు ఆర్థిక సహకారం అందించారు. కేవలం విరాళాలు అందించడమే కాకుండా, స్వయంగా కార్యక్రమానికి హాజరై కళాశాల పట్ల తమకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు.

రెండేళ్లలో రూ.10 కోట్లకు పైగా అభివృద్ధి పనులు
గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఎన్.వి. సుందరాచారి బాధ్యతలు చేపట్టి నవంబర్ 1వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ రెండేళ్ల కాలంలో ఆయన చొరవతో పూర్వ విద్యార్థుల సహకారం, ప్రభుత్వ నిధులతో కలిపి రూ.10 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు చేపట్టడం విశేషం. కళాశాలలో మౌలిక సదుపాయాల మెరుగుదల, విభాగాల ఆధునీకరణకు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అధ్యాపకులు, సిబ్బంది అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ బి. హరిత, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ మోహన లక్ష్మి, డాక్టర్ సుధారాణి, విభాగ అధ్యాపకులు, సిబ్బంది, 1980 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తమ విద్యాసంస్థ అభివృద్ధికి ఉదారంగా సహకరించిన పూర్వ విద్యార్థులకు కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
#GunturMedicalCollege #GunturNews #Alumni #1980Batch #Biochemistry #MedicalCollegeDevelopment #AndhraPradesh #MedicalEducation #APNews #TeluguNews #GEETV #GEETVNews