తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు
GEETV||హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించి, గ్లోబల్ సప్లై చైన్‌లో భాగస్వాములను చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ప్రత్యేక ఆర్థిక ప్రగతి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోందని తెలిపారు.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో నిర్వహించిన మెగా ఎఫ్‌టీఏ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో ఎగుమతుల రంగం కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ – ఎఫ్‌టీఏ) దేశీయ పరిశ్రమలకు కొత్త వాణిజ్య అవకాశాలను కల్పిస్తున్నాయని మంత్రి వివరించారు. ఈ అవకాశాలను రాష్ట్రంలోని పరిశ్రమలు, ఎగుమతిదారులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రభుత్వం అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.

ప్రపంచ మార్కెట్లలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఉత్పత్తులు
‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఉత్పత్తులను ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాల మార్కెట్లకు విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులను గుర్తించి, వాటి తయారీ, ప్రాసెసింగ్, నాణ్యత పెంపు, ఎగుమతులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. దీనివల్ల స్థానిక పరిశ్రమలకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వ్యవసాయ రంగం గురించి ప్రస్తావిస్తూ.. దేశీయ ఆహార అవసరాలు తీరిన అనంతరం మిగిలే వ్యవసాయ ఉత్పత్తులు వృథా కాకుండా వాటిని అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతులకు కూడా మెరుగైన ఆదాయ అవకాశాలు కల్పించవచ్చన్నారు.
ఎఫ్‌టీఏల ద్వారా లభించే ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు, పరిశ్రమలకు మరింత మార్గనిర్దేశనం చేయాలని మంత్రి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎగుమతుల రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, వివిధ జిల్లాల కలెక్టర్లు మను చౌదరి, ప్రియాంక ఆలా, కుష్బూ గుప్తా, అనురాగ్ జయంతి తదితర అధికారులు పాల్గొన్నారు.
#Telangana #SridharBabu #TelanganaIndustries #GlobalSupplyChain #FTA #FreeTradeAgreement #MadeInTelangana #MSME #Exports #TelanganaEconomy #THub #HyderabadNews #TeluguNews #GEETV #GEETVNews