నాగార్జున యూనివర్సిటీ తొలి పాలకమండలి సమావేశం.. అగ్ని పరీక్షేనా?
12 మంది ఆచార్యుల సర్వీస్ క్లబ్బింగ్ వివాదంపై నిర్ణయం తీసుకుంటారా?
CAS మెమోపై చర్చిస్తారా? పాలకమండలి వైఖరిపై సర్వత్రా ఉత్కంఠ!
లేక వివాదాస్పద అంశాలన్నీ యథాతథంగా కొనసాగుతాయా?
సర్వీస్ క్లబ్బింగ్‌కు ఆమోదం లభించకపోతే ఏం జరుగుతుంది?
ఇప్పటివరకు పొందిన ఆర్థిక ప్రయోజనాలను వెనక్కి తీసుకుంటారా?
లేక మరోసారి న్యాయపోరాటానికి తెరలేస్తుందా ?
అందరి చూపు పాలకమండలి నిర్ణయాలపైనే!
Parasuram Pachava | Bureau Chief | GEETV
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పాలకమండలి తొలి సమావేశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండేళ్లకు పైగా పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్ లేకుండా కొనసాగుతున్న యూనివర్సిటీలో తాజాగా పాలకమండలి ఏర్పాటుతో కీలక నిర్ణయాలపై ఆశలు చిగురిస్తున్నాయి. అయితే యూనివర్సిటీలో చాలాకాలంగా పరిష్కారానికి నోచుకోని వివాదాలు, ఉద్యోగుల సర్వీస్ అంశాలు, సీనియారిటీ సమస్యలు, పదోన్నతులకు సంబంధించిన అంశాలు ఈ తొలి సమావేశానికి సవాల్‌గా మారనున్నాయా? అన్న ప్రశ్న ఇప్పుడు విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి పలు చర్యలు చేపడుతోంది. ఉపాధ్యాయ నియామకాలు, కొత్త డీఎస్సీ నోటిఫికేషన్, విద్యాసంస్థల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాత్రం కొన్ని పరిపాలనా వ్యవహారాలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా 12 మంది ఆచార్యులకు సంబంధించిన సర్వీస్ క్లబ్బింగ్ అంశం యూనివర్సిటీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన కాలాన్ని కలిపి సీనియారిటీ నిర్ణయించుకోవడం, దాని ఆధారంగా పదవులు, హోదాలు, ప్రయోజనాలు పొందే అంశంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వీస్ క్లబ్బింగ్ వ్యవహారంపై న్యాయపరమైన వివాదం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో, పాలకమండలి ఈ అంశాన్ని ఎలా పరిశీలించబోతోందన్నది కీలకంగా మారింది.
మరోవైపు ఎలాంటి స్పష్టమైన నోటిఫికేషన్ ప్రక్రియ లేకుండా ఉద్యోగ నియామకాలు జరిగాయనే ఆరోపణలు కూడా యూనివర్సిటీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకమండలిపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక 12 మంది ఆచార్యుల సర్వీస్ క్లబ్బింగ్ అంశానికి సంబంధించిన సీనియారిటీ వివాదం మరో కీలక పరిణామంగా మారింది. ఈ అంశాలకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలు, వాటికి సంబంధించిన అనుమతులు, నిబంధనలు, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను పాలకమండలి పరిశీలిస్తుందా? లేక ఇప్పటికే కొనసాగుతున్న విధానాన్నే ఆమోదిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో CAS (Career Advancement Scheme) కింద జరిగిన పదోన్నతులకు సంబంధించి 12 మంది ఆచార్యుల వ్యవహారంపై ప్రభుత్వం 28-10-2026న ఉన్నత విద్యాశాఖ ద్వారా మెమో జారీ చేసిన అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ మెమోలో ప్రస్తావించిన అంశాలపై పాలకమండలి చర్చిస్తుందా? సంబంధిత రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలకు ఆదేశిస్తుందా? అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మరోవైపు వేతనాల పెంపు, ఉద్యోగుల హోదాల మార్పు, ఇతర పరిపాలనా ప్రయోజనాలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వివాదాల్లో ఉన్న అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు, న్యాయస్థానాల పరిధిలో ఉన్న వ్యవహారాలు, ప్రభుత్వ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆమోదం లభించకపోతే వేతనాల రికవరీ తప్పదా?
ఇక ఈ వివాదంలో మరో కీలకమైన ప్రశ్న తెరపైకి వస్తోంది. 12 మంది ఆచార్యులు కలుపుకున్న సర్వీస్ క్లబ్బింగ్‌ను పాలకమండలి ఆమోదించకపోతే తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ సర్వీస్ క్లబ్బింగ్ ఆధారంగా పొందిన అదనపు వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఇతర హోదాలకు సంబంధించిన ప్రయోజనాలపై ప్రభుత్వం సమీక్ష చేపడుతుందా? నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగినట్లు తేలితే సంబంధిత మొత్తాలను తిరిగి రికవరీ చేసే దిశగా చర్యలు ఉంటాయా? అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.
ఇక్కడే పాలకమండలి ముందున్న అసలైన పరీక్ష మొదలుకానుంది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పారదర్శకమైన పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తుందా? గతంలో జరిగిన నిర్ణయాలను సమీక్షించి తప్పొప్పులను గుర్తిస్తుందా? లేక వివాదాస్పద అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ముందుకు సాగుతుందా? అన్నది కీలకంగా మారింది.
ముఖ్యంగా యూనివర్సిటీ భవిష్యత్తు, విద్యార్థుల ప్రయోజనాలు, బోధన సిబ్బంది సీనియారిటీ, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత వంటి అంశాలపై పాలకమండలి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పలువురు మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఆచార్యులు కోరుతున్నారు.
#NagarjunaUniversity #ANU #ANUGuntur #GEE TV #GEE TV News #GunturNews #APNews #HigherEducation #CASProfessors #ServiceClubbing #UniversityNews #AndhraPradesh