నల్లపాడు, అంకిరెడ్డిపాలెంలో లక్ష్మీ అపర్ణ ప్రచారం | పెమ్మసాని, బూర్ల రామాంజనేయులు |
రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు
గుంటూరు: నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గురువారం 36వ డివిజన్ పరిధిలోని నల్లపాడు, అంకిరెడ్డిపాలెం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తదితర కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గుంటూరు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సహకారం, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో నగర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తోందని పేర్కొన్నారు.
నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని, ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రహదారుల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు సంబంధిత ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేస్తామని తెలిపారు. నగరాభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగాలంటే ప్రజల సహకారం అవసరమని పేర్కొంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నల్లపాడు ప్రాంతంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో 105 ఎకరాల్లో తెలగమాంబ చెరువు అభివృద్ధికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రానున్న రోజుల్లో మరింత కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గుంటూరు నగరాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు.
#LakshmiAparna #PemmasaniChandrasekhar #BurlaRamanjaneyulu #Guntur #Nallapadu #Ankireddypalem #GunturElections #NDAAlliance #GunturMayor #GunturDevelopment #AndhraPradesh #TeluguNews #GEETV #GEETVNews