సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
పచ్చవ పరశురాం
అమరావతి, అక్టోబర్ 30: 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. అమెరికాలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.

జీవితంతో సాగించిన పోరాటంలో బాలసుబ్రహ్మణ్యం అసాధారణ ధైర్యం, మనోనిబ్బరాన్ని ప్రదర్శించారని డీజీపీ పేర్కొన్నారు. ఆయన మరణం పోలీస్ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో వివిధ కీలక హోదాల్లో పనిచేసి విశిష్ట సేవలందించిన ఆయన, తన వృత్తిపరమైన నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని కొనియాడారు.
జగిత్యాల ఏఎస్పీగా పోలీస్ సర్వీసును ప్రారంభించిన బాలసుబ్రహ్మణ్యం.. అనంతరం గ్రేహౌండ్స్‌తో పాటు నిజామాబాద్, విశాఖపట్నం రూరల్, మహబూబ్‌నగర్, నల్గొండ, ప్రకాశం జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. పోలీస్ శాఖలో కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగంలో డీఐజీ, ఐజీ హోదాల్లో పనిచేశారు. అదనపు డీజీపీగా, డీజీపీ (ఆర్గనైజేషన్)గా కూడా బాధ్యతలు నిర్వర్తించి తనదైన ముద్ర వేశారు.
అంకితభావం, క్రమశిక్షణ, వృత్తిపరమైన నిబద్ధతతో విధులు నిర్వహించిన ఆయన సేవలు పోలీస్ శాఖకు చిరస్మరణీయమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. సహచర అధికారులతో, సిబ్బందితో ఆయనకు ఉన్న అనుబంధం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
ఈ విషాద సమయంలో బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు డీజీపీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ అపార దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.