మురుసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హైఅలర్ట్
Parasuram Pachava | Bureau Chief | GEETV
అమరావతి: కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపంలో కొనసాగుతున్న మురసు తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను సన్నద్ధత, ముందస్తు చర్యలపై రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కోస్తాంధ్రతో పాటు దిగువ జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో 13 నుంచి 15 టీఎంసీల వరకు నీటి ప్రవాహాలు వచ్చే అవకాశముందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో చెరువులను నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లలోనూ నీటిని సమర్థవంతంగా నిల్వ చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

గతంలో అర్నబ్ తుఫాను కారణంగా జరిగిన విధ్వంసం నుంచి చాలా ప్రాంతాలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మురసు తుఫాను ప్రభావాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అర్నబ్ తుఫానుతో పోలిస్తే మురసు తుఫాను ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని అధికారులు వివరించినప్పటికీ, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
గత తుఫాను సమయంలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 31 వేల విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయికి తరలించి పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత తుఫాను గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సుమారు 8 వేల విద్యుత్ స్తంభాల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖతో పాటు అన్ని విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
#MurusuCyclone #ChandrababuNaidu #CycloneAlert #APWeatherUpdate #AndhraPradesh #Amaravati #APGovernment #CyclonePreparedness #HeavyRainfall #Guntur #Bapatla #Palnadu #Prakasam #Nellore #Rayalaseema #NagarjunaSagar #Pulichintala #GEETV #GEETVNews