స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు షాక్.. బడ్జెట్ ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు త్వరలో ధరల షాక్ తగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా బడ్జెట్ మొబైల్ ఫోన్ల ధరలు దాదాపు 30 శాతం వరకు పెరిగే అవకాశముందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా మెమరీ చిప్‌లకు కొరత ఏర్పడటం, వాటి ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.
స్మార్ట్ఫోన్ల తయారీలో మెమరీ చిప్‌లు కీలక భాగం. 2025లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం మెమరీ చిప్‌ల ధరలు దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు నివేదిక అంచనా వేసింది. AI డేటా సెంటర్లు, ఇతర సాంకేతిక అవసరాల కోసం మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరగడంతో మొబైల్ తయారీ సంస్థలపై ఉత్పత్తి వ్యయ భారం పెరుగుతోంది.
ఈ ప్రభావం ముఖ్యంగా తక్కువ ధరలో లభించే బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. తయారీ వ్యయం పెరిగితే కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. దీంతో ఇప్పటికే పరిమిత బడ్జెట్‌తో ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల ఇబ్బందిగా మారనుంది.
మొబైల్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులు ఇప్పుడే ఫోన్ కొనాలా? లేక ధరలు తగ్గే వరకు వేచి చూడాలా? అన్న సందిగ్ధంలో పడుతున్నారు. అయితే ధరల పెరుగుదల ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఏయే కంపెనీల మోడళ్లపై ఎంత ప్రభావం ఉంటుంది అన్నది ఆయా సంస్థల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
#SmartphonePriceHike #BudgetMobiles #MobileNews #AI #MemoryChips #TechNews #GEETVNews