నాగార్జున యూనివర్సిటీలో అంతా మా ఇష్టమేనా?
కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? ఉన్నత విద్యాశాఖ మెమోకు విలువ లేదా?
12 మంది ప్రొఫెసర్ల అక్రమ సర్వీస్ వ్యవహారం నుంచి వరుస పదవుల కేటాయింపు వరకు.. వివాదాల వలయంలో యూనివర్సిటీ పాలన!
సీనియార్టీ ఉన్న ఉదయ్ కుమార్‌ను పక్కనపెట్టి త్రిమూర్తిరావుకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలు
Parasuram Pachava | Bureau Chief | GEETV
GEETV, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు యూనివర్సిటీ పాలనా వ్యవస్థపై తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జరగాల్సిన నియామకాలు, సీనియార్టీ నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. 12 మంది ప్రొఫెసర్ల సర్వీస్ వ్యవహారంపై ఆరోపణలు, ప్రిన్సిపాల్ కేటగిరీలో EC సభ్యత్వం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ICT డైరెక్టర్ బాధ్యతలు, తాజాగా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ నియామకం.. ఇలా వరుస పరిణామాలు యూనివర్సిటీని వివాదాల కేంద్రంగా మారుస్తున్నాయి.
12 మంది ప్రొఫెసర్ల సర్వీస్ వ్యవహారంపై సమాధానం ఏది?
యూనివర్సిటీలో 12 మంది ప్రొఫెసర్ల సర్వీస్‌కు సంబంధించి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు చాలాకాలంగా చర్చలో ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఏ నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు? ఎవరికి ఏ ప్రాతిపదికన సర్వీస్ ప్రయోజనాలు కల్పించారు? సంబంధిత ఫైళ్లను ఎవరు ఆమోదించారు? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఉద్యోగుల సర్వీస్, సీనియార్టీ, పదోన్నతుల విషయంలో పారదర్శకత పాటించాల్సిన యూనివర్సిటీలో ఇలాంటి ఆరోపణలు రావడం సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది.
ప్రిన్సిపాల్ కాని వ్యక్తికి EC సభ్యత్వం.. ఇప్పుడు ప్రిన్సిపాల్ పదవి
ఇదిలా ఉండగా, G.O.Ms.No.48లో యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాల్ కేటగిరీ నుంచి ప్రభుత్వ నామినేషన్‌కు సంబంధించిన అంశం మరో వివాదానికి దారితీసింది. ప్రిన్సిపాల్ హోదాలో కాకుండా డీన్ హోదాలో ఉన్న త్రిమూర్తిరావు పేరును ఆ కేటగిరీలో పేర్కొనడంపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ నామినేషన్‌కు అనుసరించిన అర్హతలు, ప్రమాణాలు ఏమిటన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అనంతరం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో ICT డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారన్న అంశం తెరపైకి వచ్చింది.
తాజాగా త్రిమూర్తిరావుకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించడం వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఈ పదవికి సంబంధించి ఆచార్య ఉదయ్ కుమార్ సీనియార్టీ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ వరకు ప్రిన్సిపాల్ పదవిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోర్టు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిమూర్తిరావు నియామకం జరగడం చర్చకు దారితీసింది. కోర్టు ఉత్తర్వుల పరిధి, నియామక ఉత్తర్వుల తేదీ, వాటి మధ్య ఉన్న సంబంధంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఉన్నత విద్యాశాఖ మెమోను కూడా పట్టించుకోరా?
గత నెలలో ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన మెమోలో సీనియార్టీ నిర్ణయానికి ఉద్యోగంలో చేరిన తేదీని ప్రాతిపదికగా తీసుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం. ఉదయ్ కుమార్ 2003లో ఉద్యోగంలో చేరగా, త్రిమూర్తిరావు 2006లో చేరినట్లు సంబంధిత వివరాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీనియార్టీ అంశాన్ని ఎలా పరిగణనలోకి తీసుకున్నారు? ఉన్నత విద్యాశాఖ మెమోను పరిశీలించారా? ఉదయ్ కుమార్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నారా? అన్న వివరాలను యూనివర్సిటీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
జీ టీవీ కథనం నిజమైంది.. అధికారుల మౌనం ఎప్పుడు వీడుతుంది?
త్రిమూర్తిరావు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని జీ టీవీ గతంలోనే కథనం ప్రచురించింది. ఇప్పుడు అదే పరిణామం చోటుచేసుకోవడంతో యూనివర్సిటీ నిర్ణయాలపై గతంలో లేవనెత్తిన అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి. అయితే ఈ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది.
ఒకవైపు 12 మంది ప్రొఫెసర్ల సర్వీస్ వ్యవహారంపై ఆరోపణలు, మరోవైపు EC సభ్యత్వం, ICT డైరెక్టర్ బాధ్యతలు, ఇప్పుడు ప్రిన్సిపాల్ పదవి.. ఈ పరిణామాలన్నింటిపై సమగ్ర పరిశీలన అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ఆదేశాలు, ఉన్నత విద్యాశాఖ మెమోలు, సీనియార్టీ నిబంధనలకు అనుగుణంగానే నియామకాలు జరిగాయా లేదా అన్నది సంబంధిత రికార్డుల పరిశీలనతో తేలాల్సి ఉంది. నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న ఈ వరుస పరిణామాలపై ఉన్నత విద్యాశాఖ స్పందించి, అవసరమైన విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.
#AcharyaNagarjunaUniversity #ANUControversy #ANU #TrimurthiRao #UdayKumar #UniversityNews #HigherEducation #SenioritiyIssue #GunturNews #GEETVNews