ఐదేళ్లు పాపాలు చేసి.. ఇప్పుడు నీతులా? జగన్‌పై ప్రత్తిపాటి పుల్లారావు ఘాటు విమర్శలు
గుంటూరు: ఐదేళ్ల పాలనలో లెక్కలేనన్ని తప్పులు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఎన్నికల నిర్వహణలో లోపాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జగన్ పాలనలో ఎన్నికలు హింసాత్మకంగా జరిగాయని, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు, ఓటర్లు దాడులకు గురయ్యారని ఆరోపించారు. అప్పట్లో ఎన్నికల బరిలో నిలిచిన వారి చేతులకు రక్తపు మరకలు అంటితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఓటర్ల వేళ్లపై సిరా చుక్కలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు సహజమని, అయితే వాస్తవాలను వక్రీకరించి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం జగన్, వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ప్రత్తిపాటి మండిపడ్డారు. తాను గెలిస్తే ప్రజాస్వామ్యం బతికినట్లు, ఇతరులు గెలిస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లు మాట్లాడటం జగన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఎన్నికల ప్రక్రియలో లోపాలున్నాయని ఆరోపించే ముందు గత ఐదేళ్ల పాలనలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.
విపత్తుల సమయంలో జగన్ ఎక్కడున్నారు?
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుపాన్లు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన ప్రజలకు జగన్ ఏనాడైనా అండగా నిలిచారా? బాధితుల వద్దకు వెళ్లి నేనున్నానంటూ ధైర్యం చెప్పారా? అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. మొక్కుబడి సమీక్షలతో సరిపెట్టి, ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితుల సమస్యలను తెలుసుకుని అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోందన్నారు.
మురసు తుపాను నష్ట నివారణ పనులు వేగవంతం
మురసు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గంలో విద్యుత్ పునరుద్ధరణతో పాటు పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీల మరమ్మతు పనులు 80 నుంచి 90 శాతం వరకు పూర్తయ్యాయని వెల్లడించారు. మిగిలిన పనులను శనివారం నాటికి పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
తుపాను కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణకు ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పారు. రోడ్లపై బురద, నేలకూలిన చెట్ల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని వివరించారు. నీటమునిగిన పంటలను వ్యవసాయశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టం వివరాలను ప్రభుత్వ యాప్‌లలో నమోదు చేస్తున్నారని తెలిపారు.
నియోజకవర్గంలో సుమారు 10 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయని, శాఖాపరమైన అనుమతులు వచ్చిన వెంటనే మరమ్మతులు చేపడతామని చెప్పారు. పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల పరిధిలో మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటనలో పేర్కొన్నారు.
#PrathipatiPullaRao #YSJagan #APPOLITICS #MurasuCyclone #CycloneRelief #TDP #YSRCP #GEETVNews