పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి

పచ్చవ పరుశురామ్
జీటీవి బ్యూరో చీఫ్

పల్నాడు: మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి, ఐపీఎస్‌ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన బోధనలు సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో సానుకూల విలువలను పెంపొందించేందుకు మహర్షుల బోధనలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి, ఐపీఎస్‌, ఏఆర్‌ డీఎస్పీ గాంధీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

#ValmikiJayanti #Palnadu #PalnaduPolice #SPJagadish #AndhraPradeshNews #GEETV

69వ వార్డులో కూటమి అభ్యర్థి ముప్పవరపు భారతి విస్తృత ప్రచారం

రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు

గుంటూరు: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 69వ వార్డులో కూటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి ముప్పవరపు భారతి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని స్థానిక కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి మరోసారి తనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా ముప్పవరపు భారతి మాట్లాడుతూ.. వార్డులో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

నవంబర్ 1వ తేదీన జరిగే ఎన్నికల్లో గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు తనకు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ప్రచారంలో భాగంగా స్థానికులను కలుసుకుంటూ కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని ఆమె కోరారు.

#MuppavarapuBharathi #GunturNews #GunturElections #69thWard #GEETV

గుంటూరు, తెనాలిలో అక్టోబర్ 30 మద్యం దుకాణాలు బంద్‌! జిల్లా కలెక్టర్‌, సి.యం. సాయికాంత్‌ వర్మ

గుంటూరు, అక్టోబర్ 26: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో మద్యం విక్రయాలను నిలిపివేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో నవంబర్‌ 1న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో, ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాల్లో విక్రయాలు నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. సంబంధిత నగరపాలక, పురపాలక చట్టాల్లోని నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

అలాగే నవంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనున్నందున, కౌంటింగ్‌కు 48 గంటల ముందు నుంచి కూడా మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడటం, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

నిషేధ నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే, సంబంధిత ఎన్నికల నిబంధనలు, చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

#GunturNews #Tenali #LiquorBan #LocalBodyElections #APNews #GEETV

గుంటూరు అభివృద్ధికి మార్వాడి, జైన్‌ సంఘాల సహకారం కీలకం: కేంద్ర మంత్రి పెమ్మసాని

డా. పచ్చవ గౌతమి
జీటీవి సీఈఓ

గుంటూరు: నగర అభివృద్ధిలో వ్యాపార వర్గాల భాగస్వామ్యం కీలకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందినప్పుడే ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గుంటూరు నగరానికి చెందిన మార్వాడి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కన్వెన్షన్‌ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం బలపరిచిన మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో కలిసి సమావేశానికి హాజరయ్యారు. మార్వాడి, జైన్‌ సోదరులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్ఫూర్తిని సమాజానికి అందించడం అభినందనీయమని పెమ్మసాని అన్నారు. వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవలోనూ ఈ వర్గాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని పెమ్మసాని తెలిపారు. మొబైల్‌ తయారీ రంగం విస్తరణ, విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలతో పాటు విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ఆదాయపు పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన రాయితీలను కూడా ఆయన ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.

గుంటూరు నగర అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ.. సుమారు రూ.600 కోట్లతో ఏడు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు (ఆర్‌ఓబీలు), రూ.571 కోట్లతో అమృత్‌ భారత్‌ 2.0 పథకం ద్వారా తాగునీటి సదుపాయాలు, రూ.400 కోట్లతో రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పెమ్మసాని వివరించారు. శంకర్‌ విలాస్‌ వంతెన నిర్మాణం విషయంలోనూ వెనుకడుగు వేయబోమని ఆయన అన్నారు. నిర్మాణ పనులను పూర్తి చేయడానికి అవసరమైన బాధ్యత తీసుకుంటానని, అవసరమైతే తన సొంత నిధులతోనైనా నష్టపరిహారం అందించి పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. వివాదాలకు దూరంగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకునే మార్వాడి, జైన్‌ సంఘాల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు.

నగర అభివృద్ధికి సహకరించండి: లక్ష్మీ అపర్ణ

గుంటూరు నగర అభివృద్ధిలో మార్వాడి సంఘ సభ్యుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ అన్నారు. మార్వాడి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోసేవ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు.నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని పేర్కొంటూ, ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీతో మద్దతు ఇవ్వాలని సంఘ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ కోవెలమూడి (రవీంద్ర) నాని, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు తిరుపతిరావు, టీడీపీ నాయకుడు ఉగ్గిరాల సీతారామయ్య, మాజీ కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్‌ (బాబు), జుగ్‌ రాజ్‌ జైన్‌ భండారి, వినోద్‌ జైన్‌, రాజేంద్ర జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

#GunturNews #PemmasaniChandrasekhar #LakshmiAparna #GunturDevelopment #ShankarVilasBridge #MarwariAssociation #GEETV

తుపాను హెచ్చరికలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు అప్రమత్తతపై ఆదేశాలు

అమరావతి, అక్టోబర్ 24: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడం, తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) అధికారులతో పరిస్థితిని సమీక్షించిన సీఎం.. ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేయాలని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం పొందేందుకు, సమాచారాన్ని తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రాణనష్టం మరియు ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

#CycloneAlert #ChandrababuNaidu #AndhraPradesh #HeavyRainAlert #APWeather #GEETV