MPTC, ZPTC నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

రిపోర్టర్ : షేక్ హాజీ బాషా
జీటీవి

ప్రకాశం జిల్లా: జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్, పొన్నలూరు, కందుకూరు మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించిన ఎస్పీ.. విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు అమలు చేయాలని ఆదేశించారు. అనుమతి లేని వాహనాలు, ర్యాలీలు, గుంపులు కేంద్రాల వద్దకు చేరకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పోలీస్ యాక్ట్ 30, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 167 కింద అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నామినేషన్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, అంబులెన్స్‌లు సహా అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు.ఈ తనిఖీల్లో కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, కొండేపి సీఐ రమణయ్య, ఆర్ఐ రమణారెడ్డి, పొన్నలూరు ఎస్సై శివ నాగరాజు, కందుకూరు ఎస్సై భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

#PrakasamDistrict #MPTC #ZPTC #ElectionSecurity #APPolice #Kandukur #Ponnaluru #APElections #TeluguNews #GEETV