రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు
గుంటూరు: నగర సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదలకు న్యాయం జరగాలంటే సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య నగర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం గుంటూరు నగరంలోని పలు డివిజన్లలో సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ‘కంకి కొడవలి’ గుర్తుపై ఓటు వేసి కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
నగరంలోని 46వ డివిజన్ అశోక్‌నగర్, దేవాపురం, లక్ష్మీపురం మెయిన్ రోడ్డు, పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ ప్రాంతం, కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో ఓలేటి సుశీలకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఐదో డివిజన్లో తమ్మిశెట్టి అంకమ్మకు మద్దతుగా పాత గుంటూరు, ప్రగతినగర్ ప్రాంతాల్లో, 72వ డివిజన్లో బండారపు యశ్వంత్ శశికి మద్దతుగా రాజీవ్ గాంధీనగర్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. నగర ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య, రహదారుల దుస్థితి, డ్రైనేజీ వ్యవస్థ, ఇళ్ల స్థలాలు, పేదలకు గృహాలు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్ల వంటి సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. పాలకవర్గాలపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాల ద్వారా అనేక సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ సమస్యల పరిష్కారానికి పోరాడిన అభ్యర్థులు సీపీఐ తరఫున పోటీ చేస్తున్నారని వివరించారు. ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములయ్యే నాయకులను ఎన్నుకుంటేనే నగరపాలక సంస్థలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం లభిస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధులు జవాబుదారీగా వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రజలు ప్రశ్నించాలని సూచించారు.
గుంటూరు నగరంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఈశ్వరయ్య అన్నారు. స్థానికంగా లభించే వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధంగా పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రైతులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
నగర అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలని, రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన సేవలు అందుబాటులో ఉండాలని, ప్రతి డివిజన్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధితో పాటు ఇళ్లు లేని పేదలకు గృహాలు కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థులను ఎన్నుకోవాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, ఆ తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకుల తీరును ఓటర్లు గమనించాలని సూచించారు. ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించే ప్రతినిధులకు నగరపాలక సంస్థలో అవకాశం కల్పించాలని కోరారు.
సీపీఐ అభ్యర్థులు ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులుగా ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. మొదటి డివిజన్ అభ్యర్థి చల్లా మరియాదాస్, ఐదో డివిజన్ అభ్యర్థి తమ్మిశెట్టి అంకమ్మ, ఆరో డివిజన్ అభ్యర్థి జంగాల చైతన్య, 21వ డివిజన్ అభ్యర్థి చిన్నపోతుల వెన్నెల, 39వ డివిజన్ అభ్యర్థి బట్టగిరి వెంకటేశ్వరరెడ్డి, 46వ డివిజన్ అభ్యర్థి ఓలేటి సుశీల, 72వ డివిజన్ అభ్యర్థి బండారపు యశ్వంత్ శశిలను గెలిపించాలని కోరారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ఏడు డివిజన్లలో పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థులకు ‘కంకి కొడవలి’ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరం శ్రామిక వర్గానికి ప్రధాన కేంద్రంగా ఉందని, పేదల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజారోగ్య పరిరక్షణ, ఇళ్లు, ఇంటి స్థలాలు లేని నిరుపేదల హక్కుల సాధనలో కార్పొరేషన్ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు.
గతంలో కమ్యూనిస్టు నాయకులు కౌన్సిలర్లుగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, ఆయా ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. ఎన్నికలను ప్రతిష్ఠగా, వ్యాపారంగా భావించే రాజకీయాలకు భిన్నంగా ప్రజాసేవకు అంకితమైన అభ్యర్థులను సీపీఐ బరిలో నిలిపిందని తెలిపారు. సీపీఐ అభ్యర్థులు గెలిస్తే నగరపాలనలో ప్రజల తరఫున బలమైన గొంతుకగా నిలిచి, పాలనలోని లోపాలను ప్రశ్నిస్తూ ప్రజా సంక్షేమం, నగర అభివృద్ధి కోసం కృషి చేస్తారని అన్నారు.
ఈ ప్రచార కార్యక్రమాల్లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బందెల నాసర్ జీ, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి అరుణ్‌కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్ వలి, ప్రజానాట్యమండలి జాతీయ కార్యదర్శి గని, నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, సీపీఐ నగర కమిటీ సభ్యులు పరిమళ బన్ని, ఆకీటి రామచంద్రుడు, సురేష్, నారాయణ, స్థానిక నాయకులు శివకుమార్, అనిల్‌కుమార్, గోపాలకృష్ణ, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఐదో డివిజన్ ప్రగతినగర్‌లో తమ్మిశెట్టి అంకమ్మకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో సీపీఐ కార్యవర్గ సభ్యులు నూతలపాటి చిన్న, గుండెబోయిన లక్ష్మి, సీనియర్ నాయకుడు షేక్ అమీర్ వలి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
#GunturNews #CPI #GunturElections #GajjulaEswaraiah #MuppallaNageswaraRao #PublicIssues #GEETV