న్యూయార్క్‌ : తన పళ్లతో సోడా క్యాన్ల మూతల్ని చకాచకా తీసేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు అమెరికాకు చెందిన ఎవానిల్‌సన్‌ జోమ్స్‌ అనే వ్యక్తి. 35 ఏళ్ల ఈ వ్యక్తి తనకు తానే హ్యూమన్‌ క్యాన్‌ ఓపెనర్‌ అని పేరు పెట్టేసుకున్నాడు. మసాచూసెట్స్‌కు చెందిన జోమ్స్‌ సోడా క్యాన్ల మూతల్ని క్షణాల్లో ఒలిచిపడేస్తున్నాడు. తన ఈ పనితనం వెనుక ఐదేళ్ల కృషి ఉందంటున్నాడతను‌. ‘ లెట్స్‌ గో వైరల్‌’ అంటూ తన విద‍్యకు సంబంధించిన వీడియోలను తీసి టిక్‌టాక్‌లో షేర్‌ చేస్తున్నాడు. దీంతో ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారి, ఇతగాడు సోషల్‌మీడియా సెలబ్రిటీ అయిపోయాడు. ప్రస్తుతం జోమ్స్‌ టిక్‌టాక్‌ ఖాతాకు లక్షమంది ఫాలోయర్లు ఉన్నారు.

అతడి వీడియోలు 2.6 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకున్నాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ పేపర్‌ను చించేసినట్లుగా సింపుల్‌గా చేస్తున్నాడు.. వీడియోను చూస్తుంటేనే నా పళ్లు విరిగినట్లు అనిపిస్తోంది.. మీరు క్యాన్లను తెరవాలనుకున్నపుడు అతడ్ని పిలవండి.. అతడి పేస్టులో ఉప్పుంది!.. డబ్బు సంపాదిస్తున్న పళ్లు అవే.. దయచేసి దీన్ని ఇంట్లో ప్రయత్నించకండి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.