భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ దేశ ‘ప్రజలు యథాతథ స్థితి పునరుద్ధరించబడుతుంది అని.. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా తన అసలు స్థానానికి తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి హామీని కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఇప్పటికి కూడా ఈ సంక్షోభం గురించి తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ అంశం గురించి సోనియా కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘లడాఖ్‌లోని మన భూభాగంలోకి చైనా దళాలు ఏ తేదీన చొరబడ్డాయి? చైనా మన భూభాగంలోకి చేసిన అతిక్రమణలను ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది. మే 5 న లేదా అంతకుముందుగానా? భారత్‌-చైనా సరిహద్దుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ప్రభుత్వం స్వీకరించలేదా?’ అని సోనియా వరుస ప్రశ్నలు సంధించారు.

సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎల్‌ఏసీ వెంట చోటు చేసుకుంటున్న అసాధారణమైన కార్యకలాపాల గురించి ప్రభుత్వానికి నివేదించలేదా? మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎల్‌ఏసీ వెంబడి భారత్‌, చైనా దళాలు చొరబడటం, భారీగా బలగాలను మోహరించడం గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేదా? ప్రభుత్వం అభిప్రాయంలో ఏదైనా వైఫల్యం ఉందా?’ అని సోనియా ప్రశ్నించారు. వీటికి ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది.