అమరావతి, సత్తెనపల్లి: అమ్మ చనుబాల తీపి పూర్తిగా చవిచూడనే లేదు. అమ్మ పొత్తిళ్ల వెచ్చదనాన్ని అనుభవించలేదు.నాన్న గుండెల్లో ఉప్పొంగే అనంతమైన ప్రేమ మాధుర్యం ఇంకా తాకనే లేదు. కనుగుడ్లు తెరిచీ తెరవక ముందే నా కళ్లు శాశ్వతంగా మూతబడ్డాయి. నా పసి ప్రాణం పంచ భూతాల్లో కలిసిపోయింది. ఆరు రోజుల్లోనే నూరేళ్ల నిండు జీవితం ముగిసిపోయింది. నేను ఏం పాపం చేశానని.. అనంత లోకాలకు ఆయువుపోసే ఆడ బిడ్డననా? వరకట్నాల కటకటాలు తెంచలేని అభాగ్యురాలిననా? తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఆరు రోజుల చిన్నారి ఆత్మఘోష ఇది.

సత్తెనపల్లి మండలం ధూళ్ళిపాళ్ల గ్రామ శివారులోని ఎల్‌.వి.ప్రసాద్‌ నేత్ర వైద్యశాల సమీపంలోని బ్రిడ్జి పక్కన నేలపై దుప్పటి వేసి ఆరు రోజుల శివువును గుర్తు తెలియని వారు గురువారం వదిలి వెళ్లారు. అక్కడి ఆనవాళ్లను పరిశీలిస్తే గురువారం తెల్లవారుజామున వదిలి ఉండవచ్చునన్నట్లు ఉంది. స్థానికులు శిశువు మృతి చెంది ఉండడం చూసి డయల్‌ 100కు సమాచారం అందించారు. సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిశువు మృతదేహన్ని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.