తండ్రి బ‌య‌ట‌కు క‌ఠినంగానే క‌నిపిస్తాడు. త‌న భావోద్వేగాల‌ను బ‌య‌ట‌కు క‌నిపించ‌నివ్వ‌డు. కానీ ఇది అర్థం చేసుకోలేని వాళ్లు తండ్రిని విరోధిగా చూస్తారు. అర్థ‌మ‌వుతే అత‌ను చేస్తున్న త్యాగానికి కంట‌త‌డి పెట్టుకుంటారు. అలాంటి తండ్రి త‌న‌కు అర్థ‌మ‌వ‌డానికి కొన్ని సంవ‌త్స‌రాలే ప‌ట్టింద‌ని హీరోయిన్ ర‌ష్మికా మంద‌న్నా అంటోంది. ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో ఉంటోన్న‌ ఆమె తండ్రి గురించి సోష‌ల్ మీడియాలో భావోద్వేగ లేఖ‌ రాసుకొచ్చింది. దీనికి నాన్నతో క‌లిసి దిగిన ఫొటోను జ‌త చేసింది. ఈ సంద‌ర్భంగా త‌ల్లిదండ్రుల‌ను స‌మానంగా ప్రేమించండ‌ని చెప్పుకొచ్చింది.

“నాన్నల‌ ‌గురించి ఏమ‌ని చెప్ప‌ను.. మా నాన్న విష‌యానికే వ‌ద్దాం. అత‌డు నేను పుట్ట‌క‌ముందు ఎప్పుడూ ఓ క‌ల కంటుండేవాడు. పొడ‌వాటి జుట్టు, పెద్ద క‌ళ్లు, పొడ‌వైన ముక్కు ఉన్న పాప ఆయ‌న పొట్ట మీద ఆడుకుంటున్న‌ట్లు క‌ల వ‌చ్చింద‌ట‌. కానీ నేను చిన్న‌గా ఉన్న‌ప్పుడు అత‌ను బిజినెస్ ప‌ని మీద దూరం వెళ్లేవాడు. ఆ త‌ర్వాత నేను ఎక్కువ కాలం హాస్టల్‌లోనే ఉన్నాను. అనంత‌రం సినిమాల్లోకి వెళ్లాను. ప్ర‌స్తుతం అత‌ని బిజినెస్ పార్ట‌ర్‌గా మారాను. ఈ ప్ర‌యాణం మొత్తంలో ఆయ‌నే నా మూల స్థంభం. మేము అన్ని విష‌యాల‌ను ఎక్కువ‌గా షేర్ చేసుకునేవాళ్లం కాదు. కానీ ఒక‌రిపై ఒక‌రికి ప్రేమ ఉంద‌నే విష‌యం మాత్రం తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. చాలామంది వారికి, వారి తండ్రికి మ‌ధ్య దూరం ఉందనుకుంటారు.