వాషింగ్ట‌న్ : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ప్ర‌క‌ట‌న‌ల్ని ఫేస్‌బుక్ తొలిగించింది. కంపెనీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉద్వేశ‌పూరిత సింబ‌ల్‌ను ఉప‌యోగించార‌న్న కార‌ణంతో పోస్టులను తొలిగిస్తున్న‌ట్లు ఫేస్‌బుక్ ప్ర‌క‌టించింది. న‌వంబ‌రులో జ‌ర‌గ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నికల కోసం ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో విసృతంగా ప్ర‌చారం మొద‌లుపెట్టారు. రాజ‌కీయ ఖైదీల‌ను గుర్తించేందుకు వాడే నిషేధిత సింబ‌ల్స్‌ని ప్ర‌క‌ట‌న‌ల్లో ఉప‌యోగించార‌న్న కార‌ణంతో పోస్టుల‌ను తొలిగిస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

రాజ‌కీయ ఖైదీల‌ను గుర్తించ‌డానికి నాజీలు రివ‌ర్స్ ట్రై యాంగిల్ సింబ‌ల్‌ను వాడ‌తారు. దీన్నే ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ల్లో సైతం ఉప‌యోగించారు. విద్వేశాన్ని రెచ్చ‌గొట్టేలా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు కంపెనీ పాల‌సీకి విరుద్ధం అని పేర్కొన్న ఫేస్‌బుక్.. దానికి సంబంధించిన పోస్టులు, ప్ర‌క‌ట‌న‌ల్ని తొలిగిస్తున్న‌ట్లు ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. అయితే ఈ ఆరోప‌ణ‌ల్ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తోసిపుచ్చాయి. ఇది నాజీ చిహ్నం కాదు ఫాసిస్ట్ వ్యతిరేక సమూహం యాంటిఫా ఉపయోగించిన చిహ్నం అని పేర్కొన్నాయి. జార్జ్ ఫ్లాయిడ్ హ‌త్య‌కు నిర‌స‌న‌గా యాంటిఫా వ‌ర్గం పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌లు చేప‌ట్టడం గ‌మ‌నార్హం.