సూర్యాపేట: వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకు జనం అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ‘జై జవాన్, వందేమాతరం, భారత్‌ మాతాకీ జై, చైనా ఖబడ్దార్‌’ అంటూ పెద్దపెట్టున నినదిస్తూ, జాతీయ పతాకాలు చేతబట్టి అంతిమయాత్రలో కదిలారు. ‘వీరుడా నీ త్యాగం ఎప్పటికీ మరువం’అంటూ సూర్యాపేట పట్టణమంతా గొంతెత్తి స్మరించుకుంది. గురువారం ఉదయం 9.40 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై పట్టణ సమీపంలోని కేసారం గ్రామం వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రానికి 11.30 గంటలకు చేరుకుంది. 5.5 కిలోమీటర్ల మేర రెండు గంటల పాటు సాగిన అంతిమయాత్ర జనసంద్రమైంది.

కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు, ప్రజలు, ప్రభుత్వ ప్రముఖుల అశ్రునయనాలు, బాధాతప్తహృదయాల మధ్య సంతోష్‌బాబు అంత్యక్రియల్ని సైనిక లాంఛనాలతో చేపట్టారు. బిహార్‌ రెజిమెంట్‌ 1వ బెటాలియన్‌ సైనికులు గౌరవ సూచకంగా గాల్లోకి మూడురౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం దహన సంస్కారాలు ముగిశాయి.