భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘మా పార్టీ.. దేశం, సైనిక బలగాల తరపున నిలబడుతుంది. చైనాపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. అయితే ఈ కీలక సమావేశానికి ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఆహ్వానం లభించలేదు. గాల్వన్‌ లోయ సంఘటన తర్వాత కేజ్రీవాల్‌ ‘ఎల్‌ఏసీలో మా వీర సైనికులు మృతి చెందారనే వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఈ విషాద సమయంలో మేమంతా అమర జవాన్ల కుటుంబాలకు తోడుగా ఉన్నాం. ఈ త్యాగానికి మేం వందనం చేస్తున్నాము’ అంటూ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై దృష్టి సారించింది. జూన్‌ 19నాడు దేశ రాజధానిలో ఒకే రోజు 2000 పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 26,669కి పెరిగి కోవిడ్‌ కేసుల సంఖ్యలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.