ఇస్లామాబాద్‌: కరోనా వైరస్‌కు ఏ ఫార్మాస్యూటికల్‌ సంస్థ వ్యాక్సిన్ తయారు చేసినా ప్రపంచ దేశాలన్నింటికీ అందివ్వాలని పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్‌ ఖురేషి అన్నారు. దానిని ‘ప్రపంచ పబ్లిక్‌ వస్తువు’గా ప్రకటించాలని కోరారు. వివక్ష లేకుండా అన్ని దేశాలకు సమానాంగా వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రాణాంతక కోవిడ్‌ అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్ని సంక్షోభంలోకి నెట్టిందని, వ్యాపార, పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన్నాయన్నారు. నిరుద్యోగిత పెంచడంతో పాటు, బ్యాకింగ్‌ రంగాన్ని కోవిడ్‌ కుదేలు చేసిందని తెలిపారు. చైనా ఏర్పాటు చేసిన ‘కోవిడ్‌ పోరులో పరస్పర సంఘీభావం, బెల్ట్, రోడ్డు ద్వారా అంతర్జాతీయ సహకారం’ వీడియో కాన్ఫరెన్స్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు.

కరోనా కష్టసమయంలో ప్రపంచమంతా ఏకమవ్వాలని, పరస్పర సంఘీభావంతో వైరస్‌పై పోరు సాగించాలని ఖురేషి పిలుపునిచ్చారు. కోవిడ్‌ వ్యాప్తిని పాకిస్తాన్ నిశ్చయంగా ఎదుర్కొంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి దోహదం చేసిందని ఈ సందర్భంగా ఖురేషీ పేర్కొన్నారు. కాగా, భారత్‌, అమెరికా, యూరప్‌లోని కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల ప్రాణాలు హరించిన కరోనా, 84 లక్షల 90 వేల మందిని బాధితులుగా చేసింది. పాకిస్తాన్‌లో 1,65,062 మంది వైరస్‌ బారినపడగా.. 3229 మంది మరణించారు.