తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన చిత్రం ‘బాహుబలి’. ఎన్నో రికార్డులు, అవార్డులు ఘనతలు అందుకున్న ‘బాహుబలి’ కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి వచ్చిచేరింది. బాహుబలిలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటనకు గాను ‘రష్యా ఆడియన్స్‌ హార్ట్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2015కు గాను ప్రకంటించిన అవార్డుల జాబితాలో ప్రభాస్‌కు అభిమానులను మెప్పించిన విభాగంలో అవార్డు లభించింది. రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని విపరీతంగా పొందడంతోనే ప్రభాస్‌కు ఈ అవార్డు లభించిందని అక్కడి ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఇక ఈ అవార్డు అందుకుంటున్న రెండో భారతీయ నటుడిగా ప్రభాస్‌ నిలవనున్నాడు. గతంలో దిగ్గజ నటుడు రాజ్‌కపూర్‌ ఈ అవార్డును అందుకున్నారు. శ్రీ 420, అవారా, ఆరాధన వంటి చిత్రాలతో రష్యన్ ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుని రష్యన్‌ అభిమానులను మెప్పించిన రాజ్ కపూర్ 30ఏళ్ల క్రితం ఈ అవార్డును అందుకున్నారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి2 చిత్రాలు ఎంతటి చరిత్ర సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్‌తో పాటు రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌ తదితరులు ఈ చిత్రంలో నటించి మెప్పించారు.