అమరావతి : నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.1,210 కోట్లకు పైగా అంచనాలతో ఏర్పాటు చేస్తున్న 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కాలేజీల నమూనాలను పరిశీ లించారు.
అనంతరం సీఎం ఇచ్చిన సూచనలు, జారీ చేసిన ఆదేశాలు ఇలా ఉన్నాయి.
- సంబంధిత రంగంలో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని మెరుగు పరచాలి.
- కాలేజీల నిర్మాణం పూర్తయ్యాక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల వివరాలపై సర్వే చేయాలి. ఆ తర్వాత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఈలోగా పరిశ్రమల అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి.
- సింగపూర్, జర్మనీ, అమెరికా, యూకే దేశాల్లోని పలు యూనివర్సిటీలు, సంస్థలు మనతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల వాటిని ఇందులో భాగస్వాములను చేయాలి. ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన వారికి మేలు జరిగేలా ఎన్ఏసీ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)ని కూడా భాగస్వామిని చేయాలి.