గాల్వన్‌ లోయ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో భారత్‌కు చెందిన సైనికులను చైనా అపహరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన భారత సైనిక అధికారులు గడిచిన రెండు రోజులుగా చైనా ఆర్మీ అత్యున్నత స్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం చర్చల అనంతరం భారత్‌కు చెందిన పదిమంది సైనికులు, ఇద్దరు మేజర్‌ అధికారులను చైనా చెర నుంచి విడిపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా పలు కథనాలు ప్రచురించింది. వారంత క్షేమంగా ఉన్నారని తెలిపింది. అయితే భారత సైనిక వర్గాలు మాత్రం దీనికి భిన్నంగా ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా దాడిలో 20 మంది జవాన్లు మృతి చెందగా.. మొత్తం 76 మంది గాయపడ్డారని ప్రకటించింది. ఇక చైనా కస్టడీలో ఎవరూ లేదని స్పష్టం చేసింది. (ఒక్క జవాను మృతికి ఐదుగురిపై ప్రతీకారం)

కాగా డ్రాగన్‌ తొలిసారి 1962 యుద్ధం సమయంలో భారత సైనికులను బంధీలను చేసింది. డజన్ల కొద్ది సిబ్బందిని రోజుల తరబడి తన చెరలో ఉంచుకుంది. అనంతరం భారత ప్రభుత్వ శాంతియుతమైన చర్చలతో వారికి విముక్తి కల్పించింది. మరోవైపు తాజాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు సరిహద్దు సమస్యలను చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సైనిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. (76 మంది జవాన్లకు గాయాలు : భారత ఆర్మీ)